Type Here to Get Search Results !

నోబుల్ బహుమతి మన దేశానికి ఎందుకు రావడంలేదు? Why Nobel Prize Not Coming India

0
ఫిబ్రవరి 28, జాతీయ సైన్స్ దినోత్సవము 

1930లో భారతదేశానికి చెందిన సర్. సి.వి.రామన్ భౌతికశాస్త్రంలో నోబుల్ బహుమతి అందుకున్నారు. అప్పటికి భారతదేశం స్వతంత్ర దేశం కాదు. బ్రిటీష్ ప్రభుత్వ అధీనంలో ఉన్న వలస రాజ్యం. భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చి సుమారు 12 సం||లు కావస్తుంది. సి.వి. రామన్ నోబుల్ బహుమతి అందుకుని సుమారు 89 సంIIలు కావస్తుంది. 120 కోట్లకు పైబడిన జనాభాతో ప్రపంచజనాభాలో రెండవస్థానంకలిగి, క్రీ.పూ. 6000సం||లో ఏర్పడ్డ హరప్పా నాగరికత నుండి నేటికి 8000 సంII సుదీర్ఘ నాగరికత గలదేశంలోశాస్త్ర రంగంలో మరో నోబుల్ బహుమతి రాలేదంటే ఎంత శాస్త్ర సాంకేతిక వెనకబాటుతనంలోదేశం ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్వతంత్య భారతదేశంలో అయితే శాస్త్రసాంకేతికరంగాలలో నోబుల్ బహుమతిరానేలేదు. మనకంటే అనేక చిన్న, పేద దేశాలు సైతం నోబుల్ బహుమతులు సాధిస్తున్నాయి. 1901 నుండి నేటికి 120సం||లు నుండి భౌతిక,రసాయన, వైద్యశాస్త్ర 0లో నోబుల్ బహుమతి ఇస్తున్నారు.నోబుల్ బహుమతిని ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో అత్యున్నత గౌరవంగా భావిస్తారు మన దేశానికి ఎందుకు ఆ గౌరవం దక్కలేదు ఓసారి పరిశీలిద్దాం.
దేశ ఉన్నత విద్యారంగం పరిశోధనలకు ముఖద్వారంవంటిది. అలాంటి ఉన్నతవిద్యారంగం ఎంతద యనీయంగా ఉందీ అంటే సుమారు 1400లకు పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్న మన దేశంలో ప్రపంచస్థాయి అత్యున్నత విశ్వవిద్యాలయం ఒక్కటీ లేదు. ఉన్నత విద్యలో పరిశోధనలకై కేటాయింపులు నామమాత్రం. సాక్ష్యాత్తు విశ్వ విద్యాలయాల ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ బహిరంగంగా పి. హెచ్డి లు అంగడి సరుకులుగా మారాయి అని వ్యాఖ్యానించడం, మన పరిశోధనల నాణ్యతకు అద్దంపడుతుంది. ఉన్నత విద్యారంగంమొత్తం అవినీతి, బంధు ప్రీతి,ఆశ్రిత పక్షపాతం, నాయకుల సిఫారసుతో భ్రష్టుపట్టుకుపోయింది. ఉన్న కొద్దిపాటి మానవవనరులతో పి.జి స్థాయి విద్యను 'మమ' అనిపిస్తున్నారే తప్ప పరిశోధనాఆసక్తిని పెంచే జ్ఞానబోధ జరగటంలేదు. ఇక ఉన్నతస్థాయి సైన్స్ సంస్థలు, విద్యా సంస్థలలో అత్యున్నతస్థాయి అధికారులు రెండు రకాలుగా ఉంటారు. తమ ప్రతిభతో ఆ స్థానాన్ని అధిరోహించినవారు కొందరైతే డబ్బు, పలుకుబడి,రాజకీయాలతో ఆ స్థానాన్ని ఆక్రమించిన వారు మరికొందరు. పరుగెత్తే గుర్రాన్ని,పడుకునే గుర్రాన్ని ఒక బండికి కట్టిన తరువాత జరిగే ప్రయాణంలా ఉంది మన దేశంలో సైన్స్ ప్రగతి. ఇలాంటి ఉన్నత విద్యా రంగంలో నోబుల్ బహుమతులుకు ప్రయత్నించటం గొర్రెతోక పట్టుకుని గోదావరి ఈదే ప్రయత్నమే.

ప్రతి దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన అన్వేషణలను ఎప్పటికప్పుడు ప్రచురించడానికి సైన్స్ పత్రికలు, పరిశోధనా పత్రికలు ఉంటాయి. దేశపు అత్యున్నతస్థాయి సైన్స్ సంస్థలు పరిశోధనలు నిర్వహించడానికి, ప్రోత్సహించడానికి సదా సిద్దంగా ఉంటాయి. శాస్త్ర సాంకేతిక అంశాలలో వివిధ విభాగాలకు సంబంధించి నిరంత రం సెమినార్లు, సదస్సులు,సమ్మేళనాలు జరుగుతుంటాయి. ఇవి అన్నీ ఎంతో నాణ్యమైన, ప్రయోజనకరమైన విజ్ఞానాన్ని సృష్టిస్తుంటాయి. మన దేశంలో విద్యా విధానం యాంత్రికమైన చదువులతో ర్యాంకులు, గ్రేడులు, ఆరంకెల జీతాల సాధనే లక్ష్యం సాగుతుంది. అన్వేషణ, సృజనాత్మకత, తార్కికత వంటి ఉన్నత స్థాయి జ్ఞాన నైపుణ్యాలకు మన విద్యా వ్యవస్థలో చోటే లేదు.

మన దేశంలో అత్యున్నత స్థాయి సైన్స్ సంస్థల ఉనికే చాలామందికి తెలియదు. ఇక పత్రికలలో ప్రచు రించే పరిశోధనలే తక్కువ. అందులో చాలా భాగం భావనాత్మకమైన వ్యాసాలే ( Conceptual papers) తప్ప ప్రయోగానుకూలపరిశోధనలు ( Experimental Papers)వేళ్లమీద లెఖించవచ్చు. రామానుజన్, సి.వి.రామన్, శకుంతలా దేవి, జె.సి.బోస్, హెచ్.జె. బాబా వంటి ప్రముఖల వ్యాసాలు విదేశీపత్రికలో ప్రచురితం అయిన అనంతరమే వాటికి విలువ వచ్చింది.అలాంటి గొప్ప వారి వ్యాసాలు గతంలోనూ, ప్రస్తుతం మన దేశం సైన్స్ మ్యాగజైన్లో కనిపించవు. ఇక సంవత్సరానికి ఒకసారి జరిగే సైన్స్ సమ్మేళనం, జాతీయ సైన్స్ కాంగ్రెస్ . ఇలాంటి విజ్ఞాన సదస్సులో ప్రపంచం దృష్టిని ఆకర్షించే నూతన ఆవిష్కరణల పై చర్చలకు బదులు, చెదలు పట్టిన గత చరిత్రకు చెందిన పురాణకాలక్షేపాలు జరుగుతాయి. గతమెంతో ఘనకీర్తి వర్తమానంలో ప్రగతి నాఫీ. ఇదీ మన సైన్స్ కాంగ్రెస్ దుస్థితి. గత కాలపు మధురస్మృతులు నెమరువేసుకోవడానికే తప్ప వర్తమానంలో ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే చర్యలు, దేశ గౌరవాన్ని పెంపొందించే చర్యలు సైన్స్ కాంగ్రెస్ లో జరగవు.

| ఇక పాఠశాల స్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్లు, సైన్స్ ఎగ్జిబిషన్లు. ఇవి ప్రభుత్వ అధికారుల హడా విడి, హంగులు, ఆర్భాటాలు ప్రదర్శించటానికి, ప్రైవేట్, కార్పరేట్ పాఠశాలలు పబ్లిసిటీ చేసుకోవడానికేపనికి వస్తు న్నాయి. మొక్కుబడిగా చేసే ఇటువంటి కార్యక్రమాలలో 'రాశి' పెరిగి 'వాసి' తగ్గింది. ఇందులో ఒకటి, రెండు మంచి ఆవిష్కరణలు ఉన్నా అవి బహుమతులు తెచ్చుకోవడంతో ముగిసిపోతున్నాయి. తదనంతర ఫాలోఅప్ ఉండదు. వీటిని కళాశాలలు, విశ్వ విద్యాలయాలలో సంబంధిత విభాగాలు దత్తత తీసుకుని ఓ ప్రయోగంగా, ఓ పరికరంగా రూపొందించవలసిన భవిష్యత్ కార్యచరణ జరగడం లేదు.

భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి గద్దె నెక్కిన పెద్దలు ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 51/ఎ/ హెచ్ కు భిన్నంగా, శాస్త్రీయస్పృహకు తూట్లు పొడుస్తున్నారు. వర్షం కోసం వరుణ యాగంచేయటం, ప్రజాధనంతో యజ్ఞయాగాలు హెూమాలు చేయటం, శంఖు స్థాపన సమయంలో మంత్రించిన యంత్రాలు పాతటం, బాబాలకు సన్యాసులకు ఫింఛన్లు ఇవ్వటం, పిల్లలు పుట్టగానే ప్రభుత్వమే జ్యోతిషం రాయించటం వంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో అశాస్త్రీయతకు పట్ట కడుతూ శాస్త్రీయతకు సమాధి కడుతున్నారు. లౌకిక రాజ్యంలో మత విషయాలలో ప్రభుత్వాలు తటస్థవైఖరి అవలంభించకుండా ప్రజాధనంతో మతపరమైన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నాయి. "మేకిన్ ఇండియా”అంటూ అట్టహాసంగా ప్రచారం చేసుకుని విద్యార్థులు పరిశోధనలు చేయటానికి కాక కార్పరేట్ వర్గాలు లాభార్జనకు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచేది ఒకరైతే, ఒలింపికలో గోల్డమెడల్ తెస్తే నోబుల్ బహుమతి ఇప్పిస్తా అని ఇంకొకరు తమ జ్ఞానశూన్యతను బయట పెడతారు. పాలకులకు శాస్త్ర సాంకేతిక రంగాల పై సరైన దృక్పధం, దీర్ఘకాలిక ప్రణాళిక,నిజాయితీ సాధన లేదు. 

ఇలాంటి ప్రతికూల వాతా వరణంలో సైన్స్ ప్రయోగాలు ఎలా సాగుతాయి?శాస్త్రవేత్తలు ఎలా తయారవుతారు?
“మనదేశంలో లాజిక్లకంటే మ్యాజిక్ లకే విలువ ఎక్కువ. అందుకే సైంటిస్ట్ ల కంటే బాబాలకే ఇక్కడ ఎక్కువ విలువనిస్తారు అనేది ఒక పాపులర్ సినిమాలో సంభాషణ. మూఢనమ్మకాలు, ఆచార సాంప్రదాయాల విపరీత ప్రభావం,ఆధిపత్య, అహంకార ధోరణి,నిరక్షరాస్యత వంటి అంశాలు, శాస్త్రీయ పరిశోధనలు చేసేవారికి ఏ మాత్రం అనుకూల వాతావరణం కల్పించకపోగా, అభధ్రతకు, భయాందోళణలకు గురి చేస్తున్నాయి.

దేశంలో ప్రతి యేడు అనేక ‘పద్మాలు' వికసిస్తాయి. ఈ దేశపు అత్యున్నత పద్మ అవార్డు అందుకుంటేఈ దేశంలో ఆ రంగంలో సమకాలీనతలో అత్యుత్తమ వ్యక్తులు అని అర్ధం. అలాంటి పద్మాలు ప్రపంచ స్థాయికి వెళ్లే సరికి ఎందుకు వాడిపోతున్నాయి? ఈదేశంలో పరిశోధనలకు అవకాశం లేదు. పరిశోధనలకు ప్రోత్సాహం, గౌరవం కూడా లేవు. దేశీయ అవార్డులు రాజకీయ దురుద్దేశాలతో ఇస్తే విదేశీ పురస్కారాలు ఎలా లభిస్తాయి? | దేశ చారిత్రలో అత్యున్నతస్థాయి విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానం ఉన్నది అన్నది ఎంత చారిత్రక సత్యమో, ఆ విజ్ఞాన శాస్త్రాన్ని వివక్షతో అభివృద్ది చెందకుండా చేశారు అనేది అంతే చారిత్రక సత్యం. వర్ణవివక్ష, గ్రాంధిక భాష లో విజ్ఞానాన్ని పొందుపరచటం, ఇతరులకు అందుబాటులోకి రాకుండా చేసిన గోప్యత,దేశీయ శాస్త్ర పరిజ్ఞానాన్ని చెప్పుకోవటానికే తప్ప అనుబవించటానికి అవకాశం లేకుండా చేశాయి. మధ్యయుగాలలో అలముకొన్న ఈ విజ్ఞాన అంధకారంలోనే నేటికీ మనం ఉన్నాం.

ఇప్పటికీ మనం వివక్షలోనే ఉన్నాం. మేధోవనరులలో సగభాగం అయిన స్త్రీలు అభధ్రత, వివక్ష విష వలయాలు దాటుకుని ఉన్నతవిద్య అభ్యసించడమే గగనం. జ్ఞాన సరస్వతుల అమోఘ మేధోశక్తి పురుషాధిక్య భావజాలపు బూటుకాలిక్రింద నలిగిపోతుంది. యువ, ఔత్సాహిక పరిశోధకురాళ్ల లో కొందరు తమ పరిశోధనా మార్గదర్శకులు తమ శీలాలను గురుదక్షిణగా సమర్పించమంటున్నారు అంటూ కన్నీరు పెడుతుంటే, ఈ నేల పై విజ్ఞానశాస్త్రం ఎలా అభివృద్ది చెందుతుంది?

ఇక దేశ గౌరవాన్ని తమ భుజ స్కంధాలమీద మోయవలసిన యువతలో అధిక శాతం జ్ఞానార్జన, పరిశోధ నాశక్తి వంటి ఆవశ్యక జీవన నైపుణ్యాలు వదలి సినిమాలు, క్రికెట్, సెల్ ఫోన్ పిచ్చిలోతమ అమూల్య సమయాన్ని వృధాచేసుకుంటున్నారు. వ్యర్థ, నిరర్ధక మానవ వనరులుగా తమని తామే మార్చుకుంటున్నారు.

పేద, గ్రామీణ ప్రాంతాలలో పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు కని పెట్టినా పేదరికం, ప్రాంతీయ వెనుకబాటుతనం, అర్ధరహితమైన నిబంధనలు, ఉన్నతస్థాయిలో పలుకుబడి లేకపోవడంతో వారి విజ్ఞానం అడవి కాచిన వెన్నెల అవుతుంది.

ఇక పరిశోధనలు ప్రోత్సహించడం, అశాస్త్రీయ భావజాలం నుండి శాస్త్రీయ దృక్పధం వైపు నడిపించ వలసిన పెద్దతరం ఆ పని చేయకపోగా గత కాలం గొప్పలు చెప్పుకోవడం, దేశీయ విజ్ఞానం, విదేశీ పరిజ్ఞానం అంటూ వేరు చేసి మిధ్యా ఆధిపత్య భావన కలిగిస్తున్నారు.దేశభక్తి ముసుగులో విజ్ఞాన శాస్త్రం పై దాడిచేస్తున్నారు. వాస్తవానికి విజ్ఞానానికి భౌగోళిక సరిహద్దులు లేవు. శాస్త్ర సాంకేతికతకు ప్రాంతీయ బేధాలులేవు.శాస్త్రవేత్తలకు వర తమ స్వార్ధం లేదు. ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎక్కడ ఏ కొత్త పరిజ్ఞానాన్ని అన్వేషించినా ఆ శాస్త్రీయ ఫలాలు అందరివీ. ఏ శాస్త్ర విజ్ఞానం అయినా సాంకేతిక అంశంగా మరి వినియోగం లోనికి వస్తే ప్రపంచ ప్రజలందరి జీవితాలను సుఖమయం చేస్తుంది. వేటిని విదేశీ పరిజ్ఞానం అని ముద్ర వేస్తున్నారో, వాటిని పాశ్చాత్యదేశాలు చాలా నియంత్రణతో ప్రయోజకత్వం కోసం వినియోగిస్తే అవే ఉత్పత్తులను మన దేశంలో మాత్రం విచ్చలవిడిగా వినియోగించి దుర్వినియోగం చేస్తున్నారు. ప్రలోభాల వలలో చిక్కుకొని బానిసలుగా మారుతున్నారు.

ఔత్సాహిక పరిశోధకులు ఎవరైనా తమ అన్వేషణలకు ప్రోత్సాహం, ప్రశంస అశిస్తారు. ఈ దేశంలో శాస్త్ర వేత్తలకు వేధింపులు, అవమానాలు, ఒత్తిడులు తప్ప వేరేవి దొరకవు. ఓ పక్క పరిశోధనలు చేస్తూ, మరో పక్క ఈ రాజకీయ చక్రవ్యూహాలను ఛేధించడం, వివక్షను అధిగమించడం ఎవరికైనా అసాధ్యం. విదేశాలలో పరిశోధన లకు చక్కటి వాతావరణం, ప్రోత్సాహం ఉండటంతో మేధావులంతా విదేశీబాట పడుతున్నారు. బ్రెయిన్ డ్రయిన్ అనే ఈ మేధోప్రవాహంలో నేటి తరానికి చెందిన మొదటిస్థాయి మేధావులు విదేశాలకువెళ్లగా రెండవ స్థాయి మేధావులు మనదేశంలో మిగిలారు. వీరు నూతన అన్వేణలు చేయలేరు, కేవలం నకళ్లు మాత్రం తయారుచేయగలరు. మేధోవలసలలో భాగంగా విదేశాలకు వెళ్లిన భారత సంతతికి చెందిన డా|| హరగోవింద్ ఖరానా కు 1968లోనూ, డా||యస్. చంద్రశేఖర్ కు 1983లోనూ, వెంకట్ రామన్ రామకృష్ణకు 2009లోనూ భౌతిక శాస్త్రంలో నోబుల్ బహు మతి పొందారు. సుమారు డజనుకు పైగా భారత సంతతిలో అనుబంధం కల వారికి శాస్త్ర సాంకేతిక రంగాలలో నోబుల్ బహుమతులు వరించాయి. | నోబుల్ బహుమతే కాదు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచస్థాయి, అంతర్జాతీయ స్థాయి బహుమతులు, పతకాలు దాదాపు 150కి పైగానే ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకూ భారతీయులకురాలేదు. 

నోబుల్ బహుమతి ప్రకటించడానికి ముందు ప్రపంచ వ్యాప్తంగా ఆ సంవత్సరంలో జరిగిన 100కు పైగా పరిశోధనలు ఎంపిక చేస్తారు. వాటి నుండి ఇరవై,చివరగా 5 పరిశోదనలను వడపోసి అంతిమంగా నోబుల్ బహుమతి ఇస్తారు. గత 20 సం||లుగా భారతదేవం నుండి నోబుల్ బహుమతి పరిశీలనకు ప్రాధమికంగా ఎంపిక చేసే వంద పరిశీల నలలో ఒక్కటీ లేదు. | భారతదేశంలో నోబుల్ గెలిచే సత్తా ఉన్నా మేధావులు ఇప్పటికీ ఉన్నారు. ఫిలిప్స్ రస్టస్ రచించిన రేస్ ఎవల్యూషన్ అండ్ బిహేవియర్ ప్రకారం బుద్ధికుశలత లో(ఐ.క్యూ. ఇంటలిజెంట్ కోషియంట్ లో) ఆఫ్రికా, అమెరికా, ఐరోపా దేశాల ప్రజల కంటే ఆగ్నేయ, ఆసియా దేశాలైన భారత్, చైనా దేశ ప్రజల ఐక్యూఎక్కువ.. రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా విద్యారంగంలో ఉన్నతాధికారులు అవినీతి రహితంగా వ్యవహరి oచి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రయత్నించాలి. ముందు తాము శాస్త్రీయ దృక్పదం అలవరుచుకుని ఆచరించి ఆదర్శంగా నిలవాలి. సైన్యంలో చేరి దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించడం ఎంత దేశ భక్తి కార్యమో దేశానికి నోబుల్ తీసుకురావడం అంతే దేశభక్తి కార్యంగా యువత గుర్తించాలి. బహు ముఖ వ్యూహంతో ధృఢంగా కృషి చేసిన రోజున భారత్ కు నోబుల్ బహుమతి అసాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితు లలో మార్పు రాకపోగా పరిస్థితులు మరింతగా దిగజారుతుంటే మాత్రం భారత్ కు నోబుల్ బహుమతి అందని ద్రాక్షే .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad