Type Here to Get Search Results !

అభినవ అభిమన్యుడు.. రియల్ హీరో.. అభినందన్ వర్ధమాన్ | Abhinandan Vardhaman Latest News in Telugu

0

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. ఇప్పుడు ‘అభినందన్’‌ అనే పదానికి  ఆ అర్థం మారిపోయింది. ఆమాట అన్నది ఎవరో తెలుసా! సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్రమోదీ. డిక్షనరీలో ఉన్న పదాలకు అర్థాలను మార్చగలిగే శక్తి మన దేశానికి ఉందని, సాధారణంగా కంగ్రాట్స్‌ చెప్పే క్రమంలో అభినందన్‌ పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు అభినందన్‌ అంటే ఒక రియల్ హీరో అని అర్ధాన్ని మార్చి రాసుకోవాల్సిన అవసరం వచ్చిందని మోదీ అన్నారు. ఆయన చూపిన అసమాన సాహసం దేశానికి గర్వకారణమంటూ కొనియాడారు.

ఇంతకీ ఎవరీ అభినందన్

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ 1983 జూన్ 21న భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్థమాన్ కు జన్మించాడు. 2004లో అభినందన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాల పైలట్ గా చేరాడు. 

2019 ఫిబ్రవరి 27న పాకిస్తానీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తన మిగ్-21 నడుపుతూ వెంబడించి కూల్చేశాడు. అయితే ఈ వైమానిక పోరాటంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళింది, పాకిస్తానీ వైమానిక దళం వారు దీన్ని కూల్చివేశారు. అభినందన్ ప్రయాణించే యుద్ధ విమానాన్ని పాక్ సైన్యం కూల్చివేసిన తర్వాత అతను ప్యారాచూట్ సాయంతో కింద పడిపోయాడు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం హొర్రా గ్రామం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బిమ్బర్ జిల్లాలో వాస్తవాధీన రేఖకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. 

ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం ఏమి జరిగిందంటే.. 

పాక్ లోని మహమ్మద్ రజాక్ చౌదరి అనే స్థానికుడు డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అక్కడ అసలేం జరిగిందో చెప్పాడు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తన ఇంటి ఆవరణలో పని చేసుకుంటుండగా ఆకాశంలో రెండు విమానాలు కూలిపోవడం గమనించానని చెప్పాడు. అందులోనుంచి ప్యారాచూట్ తో కిందిగి దిగిన విమాన పైలట్ వాస్తవాధీన రేఖ వైపు పరుగెత్తడం చూశానని అన్నాడు. ఇది చూసిన వెంటనే గ్రామంలోని యువకులకు సైన్యం వచ్చేవరకూ విమాన శిధిలాల వద్దకు వెళ్ళొద్దని చెప్పానని, పైలట్ ను పట్టుకునేందుకు తన వెంట రమ్మని కోరానని అన్నారు. తాము సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఆ పైలట్ పిస్టల్ చేతిలో పట్టుకుని ఉన్నాడని, అక్కడ ఉన్న యువకులను తాను ఉన్నది పాకిస్తాన్ భూభాగమా లేక భారత్ భూభాగమా అని అడిగినట్టు చెప్పాడు. ఆ యువకులు తెలివిగా భారత్ భూభాగమేనని అతని తప్పుదోవ పట్టించారు. దీనితో పైలట్ తానూ, భారతీయుడనని, తన పేరు అభినందన్ అని చెప్పి, జైహింద్ అని నినాదం చేశాడని చెప్పాడు. దీంతో కొంతమంది ఆవేశపరులైన యువకులు పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్ అంటూ అభినందన్ పై దాడులు చేయబోయారని, అప్పుడు అభినందన్ తన చేతిలోని పిస్టల్ తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని చెప్పాడు.దీంతో తమ గ్రామ యువకులు అతనిపై దాడి చేసేందుకు రాళ్లు తీసుకున్నారని చెప్పాడు. వెంటనే అభినందన్ పిస్టల్ ను తమ గ్రామ యువకుల వైపు చూపుతూ పరుగెత్తాడని చెప్పారు. తమ గ్రామ యువకులు కూడా అతడ్ని వెంటాడారని అన్నారు. ఆ సమయంలో అతను నీళ్ళలోకి దూకి తన వద్దనున్న డాక్యూమెంట్లు, మ్యాపులు అందులో వేసేశాడని తెలిపారు. కొన్నింటిని నోట్లో పెట్టుకుని నమిలేశారు. చేతిలోని పిస్టల్ వదిలి పెట్టాల్సిందిగా తమ గ్రామ యువకులు హెచ్చరించారని నీళ్లలోనుంచి అభినందన్ ను తీసుకొచ్చి, కొట్టారని అన్నాడు. ఈలోగా పాక్ సైనికులు వచ్చి అతడ్ని అదుపులోకి తీసుకున్నారని, లేకపోతే తమ గ్రామ యువకులు అతడ్ని కొట్టి చంపేసి ఉండేవారని తెలిపారు.

అభినందన్ ధైర్యసాహసాలు 

పాక్ భూభాగంపై పడిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా, శత్రువులకు చిక్కకుండా అభినందన్ యత్నించడం గమనార్హం. తాను శతృభూభాగంలో ఉన్నానని గ్రహించినా, తనను ముష్కర మూక వెంటాడుతున్నప్పటికీ తన వద్ద ఉన్న వాయుసేన డాక్యుమెంట్లు, మ్యాప్ లు వారికి దొరకకుండా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం, దేశ రక్షణలో మన సైన్యానికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటిచెబుతోంది.

అభినందన్ ని అదుపులోకి తీసుకోగానే పాక్ ఏమి చేసింది?

అభినందన్ ని అదుపులోకి తీసుకున్నవెంటనే యుద్ధఖైదీలను హింసించరాదన్న జెనీవా నిబంధలను కూడా తుంగలో తొక్కి పాక్ అభినందన్ పై అమానవీయంగా దాడి చేసి, నెత్తురోడేలా కొట్టారు. అంతేకాదు దానికి సంబంధించిన  ఓ వీడియోను కూడా విడుదల చేసింది.దీనితో పాక్ దుష్టబుద్ధి ప్రపంచదేశాల ముందు బహిర్గతమైంది. ఈ విధంగా పాక్ తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లుగా అయింది. 

పాక్ విడుదల చేసిన వీడియోలో ఏముంది?

పాక్ విడుదల చేసిన వీడియోలో ఉన్న వ్యక్తి "నా పేరు వింగ్ కమాండర్ అభినందన్. నా సర్వీస్ నెంబర్ 27981. నేనో పైలట్‌ను, నా మతం హిందూ" అని చెప్పడం కనిపించింది. చుట్టూ ఉన్నవారు మరికొన్ని ప్రశ్నలు వేయగా క్షమించండి, అంతవరకూ చెప్పడానికి మాత్రమే నాకు అనుమతి ఉంది అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు. "నేనొక చిన్న సమాచారం తెలుసుకోవచ్చా, నేనిప్పుడు పాకిస్తాన్ సైన్యంతో ఉన్నానా?" అని ఆ వ్యక్తి అడగడంతో ఆ వీడియో ముగిసింది.

అభినందన్ విడుదలకి భారత్ ఎలాంటి ప్రయత్నం చేసింది?

ఢిల్లీలో విదేశాంగ శాఖ పాకిస్థాన్‌ తాత్కాలిక హైకమిషనర్‌ సయ్యద్‌ హైదర్‌ షాను పిలిపించుకొంది. భారత పైలట్‌ను క్షేమంగా అప్పగించాలని డిమాండ్‌ చేసింది. భారత రక్షణ సిబ్బందికి ఎలాంటి హాని కలిగించరాదని స్పష్టం చేసింది. గాయపడిన వ్యక్తిని అంతర్జాతీయ మానవతా చట్టం, జెనీవా ఒప్పందానికి విరుద్ధంగా టీవీల్లో చూపడాన్ని ఖండించింది. ఇది ‘అనుచిత ప్రదర్శన’ అని వ్యాఖ్యానించింది. జాతీయ భద్రత పరిరక్షణ కోసం గట్టి, నిర్ణయాత్మక చర్యను తీసుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టంచేసింది. అయితే, బుధవారం తమ యుద్ధ విమానమేదీ కూలలేదని పాక్‌ బుకాయించింది.  

ప్రపంచదేశాలు ఏమున్నాయి?

పాక్ చెరలో ఉన్న అభినందన్ ని జెనీవా ఒప్పందానికి కట్టుబడి విడుదల చేయాలని ప్రపంచదేశాలన్ని ముక్తకంఠంతో చెప్పాయి. ఈ విషయంలో ప్రపంచదేశాలన్ని భారత్ కు అండగా నిలిచాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరకు తనకు ఆపన్నహస్తం అందిస్తుందనుకున్న చైనా కూడా పాక్ కు మొండి చెయ్యి చూపించింది. చివరకు గత్యంతరం లేక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందన్ ను విడుదల చేస్తున్నట్లుగా పార్లమెంటులో ప్రకటన చేశారు.

అభినందన్ ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. దౌత్యపరంగా భారత్ కు ఇది ఘన విజయం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ముందు, ప్రపంచదేశాలముందు పాక్ ను దోషిని చేయడంలో భారత్ విజయం సాధించింది. పాక్ అభినందన్ ను వాఘా సరిహద్దు వద్ద భారత్ కు అప్పజెప్పనున్నారన్న సమాచారం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభినందన్ కు స్వగతం పలకడానికి తండోపతండాలుగా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. అధికారులు, పెద్ద ఎత్తున మీడియా కూడా అక్కడ గుమిగూడారు.

విడుదలలో జాప్యం ఎందుకు?

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించే ముందు పాకిస్థాన్‌ సైనికాధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అభినందన్‌ అప్పగింత ప్రక్రియలో జాప్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో స్థానిక మీడియాకు పాకిస్థాన్‌ ప్రభుత్వం అభినందన్‌ వీడియో సందేశాన్ని విడుదల చేసింది.

అభినందన్ సందేశం ఏమిటి?

‘‘నేను లక్ష్య ఛేదనలో ఉండగా పాకిస్థాన్‌ వాయుసేన మా విమానాన్ని కూల్చింది. ఈ క్రమంలో ప్యారాచూట్‌ సాయంతో కిందకు దూకా. కింద చాలా మంది ఉన్నారు. నన్ను నేను కాపాడుకునేందుకు తుపాకీని అక్కడ పడేసి పరుగెత్తా. జనం వెంబడిస్తుండగా ఇద్దరు సైనికాధికారులు వారి నుంచి నన్ను కాపాడారు. కార్యాలయంలోకి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. పాకిస్థాన్‌ సైన్యం చాలా హుందాగా వ్యవహరించింది’’  అయితే, పాకిస్థాన్‌ చేస్తున్న ప్రచారానికి అనుకూలంగా ఆ వీడియోలో పలుచోట్ల కత్తెర్లు పెట్టి అతికించినట్లు స్పష్టంగా కనిపించడం గమనార్హం.

అభినందన్ 'మిగ్‌' కుటుంబం 

‘అభినందన్‌లాగే ఆయన తండ్రి ఎయిర్‌ మార్షల్‌ సింహకుట్టి వర్ధమాన్‌ కూడా మిగ్‌-21 విమానాన్ని నడిపారు. ఐదేళ్ల కిందటే ఆయన విశ్రాంతి పొందారు. అభి తాతయ్య కూడా వాయుసేనలో పనిచేశారు.

అబినందన్ కి అభినందనలు 

భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శత్రుదేశంలో ఖైదీగా ఉన్నప్పటికీ దేశ రహస్యాలేవీ చెప్పకుండా ధీరత్వాన్ని ప్రదర్శించి యావత్‌ ప్రపంచదృష్టిని ఆకర్షించారు. 

చెన్నైలో ఓ చిన్నారికి పైలట్‌ అభినందన్‌ పేరు పెట్టారు.

భారత వైమానిక దళ (ఐఏఎఫ్‌) వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పేరు దేశ వ్యాప్తంగా ఎంతగా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. 

రాజస్థాన్‌లో దౌసాలోని నిహల్పుర్‌లో విమలేశ్‌ బెందారా కు పుట్టిన మగ బిడ్డ కు కూడా అభినందన్ అని పేరు పెట్టారు.  

రాజస్థాన్‌లోని సంగనెర్‌ ప్రాంతంలో నీలం తిక్కివల్‌, రవి తిక్కివల్‌ దంపతులకి శుక్రవారం బాబు జన్మించగా, ఆ శిశువుకి అభినందన్‌ పేరు పెట్టారు.

దేశం గర్వించేలా తన బాధ్యతలు నిర్వహించిన అభినందన్ ని గౌరవిస్తూ ఇలా వారు తమ బిడ్డలకు అతని పేరు పెట్టుకున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలోగల ప్రధాన మార్కెట్‌కు ‘అభినందన్ బజార్’ అనే పేరు పెట్టారు. పైగా ఇక్కడున్న ప్రతీ దుకాణం ముందు అభినందన్ పేరు రాశారు. 

పాకిస్థాన్ చెరలో 60 గంటలకు గడిపి విజయవంతంగా భారత్‌కు తిరిగివచ్చిన అభినందన్ మనోభావాలు ఏమిటి?

పాక్ చెరలో ఉన్నప్పుడు అభినందన్ పాక్ ఆర్మీ వారు ఇచ్చిన ఒక కప్పు టీ తాగి  పాకిస్తాన్ సైన్యం యొక్క అధికారులు తనని బాగా చూశారని పేర్కొన్నారు. 

భారత కాలమానం ప్రకారం రాత్రి 9.20 నిమిషాలకు పాకిస్తాన్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించింది. 

అభినందన్‌తో పాటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఫారోహా బుట్టీ కూడా వాఘా సరిహద్దు దగ్గరకు వచ్చారు. ఆయనను భారత అధికారులకు ఆమె అప్పగించారు.

ఈ క్రమంలో పాక్ చెరలో ఉన్నప్పుడు అభినందన్ పాక్ సైనికులతో కలిసి నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలు బూటకమని, అందులో ఉన్నది అభినందన్ కాదని బీబీసీ ధృవీకరించింది. 

కాగా, విడుదల అనంతరం అభినందన్ కు  వైద్య పరీక్షలు నిర్వహించవలసి ఉంది. పాక్ అతని శరీరంలో ఏవైనా చిప్ లు వంటివి అమర్చారు అన్న విషయాలు కూడా తేల్చుకోవలసి ఉంది. 

ఏది ఏమైనప్పటికి శత్రువుల చేతికి చిక్కి కూడా భారతదేశ రహస్యలేవి శత్రుసైన్యాలకు చిక్కకుండా చేసి విజయవంతంగా పద్మవ్యూహం వంటి శత్రు చెర నుండి బయటపడ్డ అభినవ అభిమన్యుడైన అభినందన్ ని మనం కూడా అభినందిద్దాం.ఇదండీ వర్ధమాన అభినందనుడి వీరగాథ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad